: 'నేనే రాజు నేనే మంత్రి'లోని జోగేంద్ర లాంటి భర్త వద్దే వద్దు: కాజల్
దాదాపు 10 సంవత్సరాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలుగుతున్న కాజల్, తన నూతన చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' విడుదల సందర్భంగా ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. నిజ జీవితంలో జోగేంద్ర లాంటి భర్త కావాలా? అన్న ప్రశ్నకు, తాను వాస్తవ జీవితంలో 'రాధ' వంటి అమ్మాయిని కాదని, అందువల్ల తనకు జోగేంద్ర లాంటి భర్త వద్దని కుండబద్దలు కొట్టింది. రాజకీయ నాయకుడిని వివాహం చేసుకునే ఉద్దేశాలు తనకు లేవని చెప్పకనే చెప్పింది.
తన జీవితంపై రాధ క్యారెక్టర్ కు ఉన్న క్లారిటీ, తన నిజ జీవితంలోనూ ఉందని, అంతకుమించి ఆ క్యారెక్టర్ కు, తనకు పెద్దగా పోలికలు లేవని కాజల్ వెల్లడించింది. తనకు కాబోయే భర్త జోగేంద్రలా ఉండాలని కోరుకోవడం లేదని అంది. 'బాహుబలి-2' తరువాత వస్తున్న ఈ సినిమాలో రానా హీరోయిజంతో పాటు అద్భుతమైన నటనను చూపించారని కితాబిచ్చింది. ఇదో విభిన్న చిత్రంగా నిలుస్తుందని చెప్పింది. కేథరిన్ తో తాను నటించిన సీన్లు ఈ చిత్రంలో పెద్దగా లేవని అంటూనే, ఆమె కూడా అద్భుతంగా నటించిందని చెప్పుకొచ్చింది. పరిస్థితుల కారణంగా సమాజానికి వ్యతిరేకంగా మారే పాత్రలో ఆమె నటించిందని, అటువంటి పాత్ర తనకు లభిస్తే, తానెంతో సంతోషంగా నటిస్తానని అంది.