: అమెరికా సైనిక చర్యకు దిగితే.. ఇక ఆ దేశం గురించి చరిత్ర పుస్తకాల్లో చదవాల్సిందే!: ఉత్తరకొరియా తీవ్ర హెచ్చరికలు
రెండు న్యూక్లియర్ మిస్సైల్స్ ను ప్రయోగించేసరికి అమెరికా వెన్నులో వణుకు పుట్టిందని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి రేయాంగ్ హో అన్నారు. సింగపూర్ లో జరుగుతున్న ఆసియన్ రిజీనల్ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి విజయం సాధించాలని అమెరికా భావిస్తోందని విమర్శించారు. ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తీసుకొచ్చి, తమ ఎగుమతులపై అంక్షలు విధించి, తమను ఏకాకిని చేసినట్టుగా భావిస్తే అమెరికా చారిత్రక తప్పిదం చేసినట్టు అవుతుందని ఆయన హెచ్చరించారు.
తాజా ఆంక్షలతో ప్రపంచదేశాలు అమెరికా చెప్పుచేతల్లో ఉన్నాయని మరోసారి నిరూపితమైందని ఆయన స్పష్టం చేశారు. తమపై ప్రతీకారం కోసం చేయాల్సినవన్నీ చేసిన అమెరికా ముందు మిగిలిన ఏకైక అస్త్రం సైనిక చర్య అని ఆయన తెలిపారు. ఒకవేళ అమెరికా అందుకు సిద్ధపడితే... భవిష్యత్ లో అమెరికా గురించి చరిత్రపుస్తకాల్లో చదవాల్సిందేనని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఆంక్షలకు తాము భయపడే రకం కాదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై తదుపరి చర్యలుంటాయని తెలిపిన ఆయన, అణ్వాయుధ పరీక్షలు ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.