: టీడీపీ ఓటమి భయంతో వణికిపోతోంది: శిల్పా చక్రపాణి రెడ్డి
టీడీపీ ఓటమి భయంతో వణికిపోతోందని ఈ మధ్యే వైఎస్సార్సీపీలో చేరిన శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. నంద్యాలలో ఆయన మాట్లాడుతూ, ఓటమి భయంతోనే టీడీపీ కుయుక్తులు పన్నుతోందని అన్నారు. తాము టీడీపీలో ఉన్నప్పుడు చెల్లిన నామినేషన్లు వైఎస్సార్సీపీలో చేరగానే ఎలా చెల్లకుండా పోతాయని ప్రశ్నించారు. టీడీపీ ఓటమి భయంతో వణికిపోతోందని చెప్పేందుకు...ఈ ఎన్నికల్లో నలుగురు మోహన్ రెడ్డిలను ఆ పార్టీ బరిలో దించిందని ఆరోపించారు.
ఇందులో రాజమోహన్ రెడ్డి అనే మరణించిన వ్యక్తిని బతికి ఉన్నాడని చెబుతూ, అతని పేరును శిల్పా మోహన్ రెడ్డి అని పేర్కొన్నారని ఆయన ఆరోపించారు. తన సోదరుడి కుమార్తె పేరు శిల్ప అని, తమ సంస్థలన్నీ శిల్ప పేరుతో ఉన్నాయని, జిల్లాలో శిల్పా మోహన్ రెడ్డి అంటే తన అన్న సంగతి అందరికీ తెలుసని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఎన్ని కుయుక్తులకు తెరతీసినా విజయం తమదేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.