: సుష్మా మేడమ్! నేను సినిమా చూస్తున్నాను...త్వరగా నన్ను కాపాడండి: సోషల్ మీడియాలో వైరల్ ట్వీట్
సమస్యల్లో చిక్కుకున్న వారిని ఆదుకుంటున్నారంటూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పై అభినందనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు ఆమె ట్విట్టర్ కు ఆసక్తికరమైన ట్వీట్స్ కూడా వస్తుంటాయి. అలాంటి ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ట్వీట్ వివరాల్లోకి వెళ్తే... పూణేకి చెందిన విశాల్ సూర్యవంశి అనే యువకుడు జియాన్ ధియేటర్ కు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, అనుష్క శర్మ నటించిన 'జబ్ హ్యారీ మెట్ సెజెల్' సినిమా చూసేందుకు వెళ్లాడు. అయితే సినిమా నచ్చలేదన్న విషయాన్ని చెబుతూ... 'సుష్మా స్వరాజ్ జీ! నేను 'జబ్ హ్యారీ మెట్ సెజెల్' సినిమా చూస్తున్నాను...వీలైనంత త్వరగా నన్ను కాపాడండి' అంటూ ట్వీట్ చేశాడు. ఈ తుంటరి ట్వీట్ కు నెటిజన్ల నుంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.