: కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలో ఉంది: జైరాం రమేశ్
జాతీయ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు. దాన్ని కట్టడి చేస్తూ, ప్రధాని మోదీ, బీజేపీ నాయకుడు అమిత్ షా సృష్టిస్తున్న సవాళ్లను ఎదుర్కోవడంలో పార్టీ నేతలు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం పాటిస్తున్న విధానాలతో బీజేపీని ఎదుర్కోలేమని, కొత్త విధానాలను అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలను కర్ణాటక పంపించడంపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.
గతంలో బీజేపీ కూడా వారి ఎమ్మెల్యేలను వేరే ప్రాంతానికి పంపించిన రోజులు ఉన్నాయని జైరాం రమేశ్ గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కుంటోందని ఆయన అంగీకరించారు. 1996 నుంచి 2004 మధ్య కాంగ్రెస్ అధికారంలో లేనపుడు కాంగ్రెస్‌కు ఓట్ల సంక్షోభం ఉండేదని, అలాగే 1977లో ఎమర్జెన్సీ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల సంక్షోభాన్ని ఎదుర్కున్నదని రమేశ్ వివరించారు. కానీ ఇప్పుడు ఉన్నది ఓట్ల సంక్షోభం కాదని, అస్తిత్వ సంక్షోభమని ఆయన తెలియజేశారు. `భారత ప్రజలు మారిపోయారు. పాత సూక్తులు, విధానాలు వాళ్లకు నచ్చడం లేదు. అందుకే వాళ్లకు తగ్గట్లుగా కాంగ్రెస్ పార్టీ కూడా మారాలి` అని ఆయన అన్నారు. అలాగే 2017 పూర్తయ్యే లోగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు.