: అఖిలప్రియ ఏ డ్రస్ వేసుకుంటే నాకేంటి?.. హుందాగా ఉండమనే చెప్పా: రోజా
కట్టు, బొట్టు, చీర లాంటివేవీ లేకుండా... మగోడిలా చుడీదార్ తో తిరుగుతోందంటూ మంత్రి అఖిలప్రియపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రోజా వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టారు. దీంతో, తన వ్యాఖ్యలపై నేడు స్పందించిన రోజా... అఖిలప్రియ ఎలాంటి డ్రస్సులు వేసుకున్నా తనకు అభ్యంతరం లేదని, అయితే ప్రజల్లోకి వెళ్లినప్పుడు మాత్రం చీర కట్టుకుని హుందాగా వెళ్లాలనే తాను సూచించానని చెప్పారు.
చంద్రబాబుది మహిళా వ్యతిరేక ప్రభుత్వమని రోజా మండిపడ్డారు. మహిళా ఐఏఎస్ అధికారిని వేధిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీలో తమను నరికేస్తానన్న ఎమ్మెల్యే బొండా ఉమపై చర్యలేవని అడిగారు. మహిళలను కించపరిచేలా ప్రవర్తించిన మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.