: బీజేపీ 60 సీట్లు గెలిస్తే...నేను రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతా!: సీఎం వీరభద్రసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ 60 అసెంబ్లీ సీట్లు గెలిస్తే రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతానని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, పీకల్లోతు అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్రసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉనా నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ‘మిషన్ 60 ప్లస్’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. ఆ పార్టీ చెప్పినట్టు 60 సీట్లు గెలిస్తే తాను రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లిపోతానని ఆయన తెలిపారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐక్యంగా కృషి చేస్తారని అన్నారు. తమ పార్టీలో క్రమశిక్షణగల కార్యకర్తలున్నారని, వారు ఆయారాం గయారాం తరహాలో పని చేయరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ నిరంకుశత్వాన్ని నమ్మే పార్టీ అని, దానికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని అన్నారు.