: తలపై చేతులు పెట్టడం, ముద్దులు పెట్టడం తప్ప మీరు చేసేదేముంది?: జగన్ పై జలీల్ ఖాన్ ధ్వజం
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్పుడే జగన్ కు ముస్లింలు గుర్తొస్తారని... ఆ తర్వాత ఏనాడూ ఆయన ముస్లింల గురించి మాట్లాడడని విమర్శించారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారి తలపై చేతులు పెట్టడం, ముద్దులు పెట్టడం మినహా... జనాల కోసం ఆయన చేస్తున్నది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రినే నడిరోడ్డుపై కాల్చి చంపాలని జగన్ అంటున్నారని... ఒకవేళ ఆయన సీఎం అయితే మిమ్మల్ని బతకనిస్తారా? అని ప్రశ్నించారు.
"ఈ నెల 9వ తేదీ నుంచి 21 వరకు నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తానని అంటున్నావ్... నంద్యాలకు వెళ్లి ఏం చేస్తావ్... తలల మీద చేతులు పెడతావ్, ముద్దులు పెడతావ్... అంతకు మించి నీవు చేసేదేముంది?" అంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికైనా వంద రూపాయలు సహాయం చేశావా? అంటూ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హజ్ యాత్రికుల ఆత్మీయ సత్కార సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.