: జీఎస్టీ విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్... ప్రధానికి లేఖ!
ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రం విధించిన 12 శాతం జీఎస్టీ విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకోసం నిర్మిస్తున్న నిర్మాణాలపై కేంద్రం ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. జీఎస్టీ అమలుకు ముందే 5 శాతం వ్యాట్‌తో అన్ని బడ్జెట్ కేటాయింపులు, అంచనాలు పూర్తైన ప్రాజెక్టులపై కొత్తగా 12 శాతం జీఎస్టీ కలుపుతూ అంచనాలు సవరించడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. దీని గురించి ప్రధాని మోదీకి లేఖ రాయాలని ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో కేసీఆర్ నిర్ణయించారు. లేఖలో పొందుపరచాల్సిన అంశాల గురించి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో పాటు ఇతర అధికారులతో చర్చించారు.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం విధించిన 12 శాతం జీఎస్టీ వల్ల తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీటిపారుదల, మిషన్ భగీరథ, గృహ నిర్మాణం, విద్యుత్ ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణంపై ఎంత ప్రభావం పడుతుందో లెక్కించిన తర్వాత, ఆ వివరాలను ప్రధాని లేఖలో పొందుపరచాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన జీఎస్టీ వల్ల ప్రాజెక్టులపై పడే భారం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడే భారం, ప్రాజెక్టుల పనితీరు, ప్రాజెక్టుల ఉపయోగం వంటి అంశాలతో పూర్తి గణాంకాల వివరాలను ఒకట్రెండు రోజుల్లో అందజేయాలని సంబంధిత అధికారులను కేసీఆర్ ఆదేశించారు. జీఎస్టీ వల్ల కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం కోసం బయటి సంస్థలతో చేసుకున్న ఒప్పందాల లెక్కల్లో తేడా వచ్చే అవకాశముందని, ఇది అన్ని రాష్ట్రాల్లో తలెత్తుతున్న సమస్య కాబట్టి ఈ విషయంపై కేంద్రం పునరాలోచించాలని, ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.