: చైనావి బెదిరింపులు మాత్రమే.. చిన్నపాటి మిలటరీ ఆపరేషన్ ను కూడా చేపట్టలేదు: భారత రక్షణ శాఖ
అసోం సరిహద్దులోని డోక్లాంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా రోజుకొక రెచ్చగొట్టే వ్యాఖ్య చేస్తున్నప్పటికీ... ఆ దేశం మనపై యుద్ధానికి దిగే అవకాశాలు ఏమాత్రం లేవని భారత రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. డోక్లాం ప్రాంతం నుంచి భారత సైనికులను తరిమివేసే క్రమంలో, ఆ దేశం హెచ్చరిస్తున్నట్టు చిన్నపాటి మిలటరీ ఆపరేషన్ ను కూడా చేపట్టలేదని పేర్కొన్నాయి.
ఈ వివాదం సమసిపోవాలంటే... ఆ ప్రాంతం నుంచి ఇరు దేశాలు తమ సైనికులను ఉపసంహరించుకోవడం ఒక్కటే పరిష్కార మార్గమని చెప్పాయి. అలా కాకుండా యుద్ధానికి చైనా సిద్ధమైతే... దాన్ని ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని, మనకు ఆ సత్తా ఉందని తెలిపాయి. చైనా ఆర్మీ ఏదైనా దుస్సాహసానికి తెగబడితే... దాన్ని తిప్పికొట్టేందుకు ఇప్పటికే సరిహద్దులో మన సైన్యం సన్నద్ధతను పెంచిందని చెప్పాయి. ప్రస్తుతం డోక్లాంలో ఇరు దేశాల సైనికులు కేవలం వందల మీటర్ల దూరంలోనే మోహరించారు.