: ఆయేషా హత్య కేసులో తప్పు చేసిన వారెవ్వరూ తప్పించుకోలేరు: ఏపీ డీజీపీ


ఆయేషా మీరా హత్య కేసులో తప్పు చేసిన వారెవ్వరూ తప్పించుకోలేరని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. విజయవాడ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో 25 మంది అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సాంబశివరావు, సీఆర్పీఎఫ్ మాజీ డీజీ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ, ఆయేషా మీరా హత్య కేసును పునర్విచారణ చేస్తామని, సిట్ విచారణలో నిజానిజాలు తేలుతాయని, పునర్విచారణలో కొత్త సాక్ష్యాల సేకరణకు సమయం పడుతుందని అన్నారు.

అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం సంతోషమని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేస్తున్న వారి సేవలు మరువలేనివని, నక్సలైట్లను ఎదుర్కొనేందుకు గ్రే హౌండ్స్ సిద్ధంగా ఉన్న రాష్ట్రం మనదేనని, గ్రేహౌండ్స్ సాయంతో రాష్ట్రంలో నక్సలైట్లను దీటుగా ఎదుర్కొన్నామని , దీంతో, పక్క రాష్ట్రాలకు నక్సలైట్లు తరలిపోయారని ,అప్పుడప్పుడు నక్సలైట్లు దాడులు చేసినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు.

ఇదిలా ఉంచితే, ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణ గురించి ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, పునర్విచారణ నిర్వహించడం ద్వారా ఈ కేసులో దోషులను పట్టుకునేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు. ఆయేషా తల్లిదండ్రులకు మహిళా కమిషన్, ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ కేసులో అసలైన దోషులకు శిక్షపడే వరకూ పోరాటం చేస్తామని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News