: గ్రహాంతర వాసిలా ఉండే తనకు ‘నాసా’లో ఉద్యోగం కావాలంటూ ఓ చిన్నారి లేఖ!


గ్రహాంతర వాసిలా ఉండే తనకు, ఓ ఉద్యోగం కావాలంటూ నాలుగో తరగతి చదువుతున్న ఓ తొమ్మిదేళ్ల చిన్నారి నాసాకు ఓ లేఖ రాసిన ఆసక్తికర సంఘటన ఇది. ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్ (గ్రహ రక్షణ అధికారి) ఉద్యోగాల నిమిత్తం నాసా ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. దీనికి స్పందించిన ఆ చిన్నారి తనకు ఉద్యోగం కావాలంటూ ఈ నెల 3న నాసాకు లేఖ రాశాడు. ఆ లేఖ ఎలా కొనసాగిందంటే ..

‘డియర్ నాసా, నా పేరు జాక్ డేవిస్. ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి నేను అప్లై చేయాలనుకుంటున్నాను. నా వయసు తొమ్మిదేళ్లే! అయినా, ఈ ఉద్యోగానికి సరిపోతాను. అందుకు గల కారణాలు చెబుతాను.. నా సోదరి నన్ను ఎప్పుడూ ఏలియన్ అని అంటూ ఉంటుంది. అంతరిక్షం, గ్రహాంతర వాసులపై వచ్చిన సినిమాలన్నీ చూశాను. నేను, చిన్నవాడిని కాబట్టి, ఏలియన్ లా ఆలోచించడం నేర్చుకోగలను ...

సిన్సియర్లీ,
జాక్ డేవిస్,
గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ,
ఫోర్త్ గ్రేడ్’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు.

అయితే, ఈ లేఖకు స్పందించిన నాసా ప్లానెటరీ సైన్స్ డివిజన్ డైరెక్టర్ జేమ్స్ ఎల్. గ్రీన్ ఆనందం వ్యక్తం చేశారు. జాక్ డేవిస్ కు తిరిగి లేఖ రాశారు. ఆ లేఖలో ‘ప్రియమైన జాక్, నువ్వు గెలాక్సీకి గార్డియన్ గా ఉన్నావని విన్నాను... మా ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం అంటే చాలా ముఖ్యమైన పని.. అయితే, భవిష్యత్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మాకు సాయం చేయాలని మేము ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాం. అందుకని, నువ్వు బాగా చదివి, మంచి ప్రతిభ కనబరిస్తే నిన్ను నాసాలో త్వరలోనే చూస్తామని ఆశిస్తున్నాం’ అని ఆ లేఖలో జేమ్స్ పేర్కొన్నారు. ఈ లేఖను జాక్ డేవిస్ కు మెయిల్ ద్వారా నాసా పంపింది. ఇదిలా ఉండగా, జాక్  డేవిస్  రాసిన లేఖ, నాసా ఎలా చూసిందనే అనుమానం తలెత్తకమానదు. ఈ లేఖను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారడం, నాసా కంట పడటం జరిగింది. 

  • Loading...

More Telugu News