: ఐటీ దాడుల వెనక సిద్ధరామయ్య హస్తం ఉంది: కర్ణాటక మంత్రి శివకుమార్ తల్లి ఆరోపణ
తన కుమారుడు, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఇంట్లో జరుగుతున్న ఐటీ సోదాల వెనక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తం ఉందని శివకుమార్ తల్లి గౌరమ్మ ఆరోపించారు. రెండు రోజులుగా మంత్రికి సంబంధించిన ఢిల్లీ, కర్ణాటక నివాసాల్లో జరుగుతున్న ఐటీ సోదాల గురించి ఆమెను మీడియా ప్రశ్నించింది.
`ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నా కొడుకు అంటే పడటం లేదు. వాడి ఎదుగుదలను ఆయన ఓర్వలేకపోతున్నాడు. అందుకే ఈ దాడులు చేయిస్తున్నాడు. ఇప్పటికే ఆయన చాలా సార్లు శివకుమార్‌కు నమ్మకద్రోహం చేశాడు. రాజకీయంగా నా కుమారుడికి ఉన్న శత్రువుల్లో ముఖ్యమంత్రి కూడా ఒకరు` అంటూ గౌరమ్మ ఆరోపణలు చేశారు.
మరోవైపు మీడియా గుచ్చి గుచ్చి అడగడం వల్ల తన తల్లి అలా మాట్లాడి ఉంటుందని శివకుమార్ సోదరుడు డీకే సురేష్ తెలిపారు. అంతేగానీ శివకుమార్‌కు, సిద్ధరామయ్యకు మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవని ఆయన అన్నారు. అంతేకాకుండా సోదాల్లో దొరికిన రూ. 11.43 కోట్ల ఆస్తులు కూడా శివకుమార్‌కి చెందినవి కావని ఆయన చెప్పారు.