: నిరుద్యోగం నుంచి బయటపడుతున్న అమెరికా!
గత 16 ఏళ్లతో పోల్చితే అమెరికాలో నిరుద్యోగిత రేటు బాగా తగ్గినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఉన్న ఆర్థిక మందగమనం ఇప్పుడు లేదని, కొత్త కొలువులు పెరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. జూలైలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగంలో 2,09,000 ఉద్యోగాలు పెరిగాయని వారు తెలియజేశారు.
ఇది మార్కెట్ అంచనాల కంటే అత్యధికమని అమెరికా కార్మిక శాఖ వెల్లడించింది. అంతకుముందు మే, జూన్ నెలల్లో ఉద్యోగిత పెరుగుదల శాతం అధికంగానే ఉందని తెలిపింది. జూన్ నెలలో 4.4 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు, జూలై వచ్చేసరికి 4.3 శాతానికి పడిపోయిందని కార్మిక శాఖ చెప్పింది. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ పురోగతి ప్రభావం ఇతర దేశ ఆర్థిక వ్యవస్థలపై కూడా బలంగానే ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.