: ఆమె కోపంలో అనుంటారు... రోజా విమర్శలపై స్పందించిన అఖిల ప్రియ!
నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో అఖిలప్రియ తన తల్లిదండ్రుల ఫొటోలు పెట్టుకుని సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన ఆరోపణలపై తాజాగా మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. ఎన్నికల ఒత్తిడి వల్ల వచ్చిన కోపంతో రోజా ఆ మాటలు అనుంటారని, వాటిని తాను పట్టించుకోనని అఖిలప్రియ అన్నారు. అలాగని తన తల్లిదండ్రుల గురించి అనడం సబబు కాదని ఆమె చెప్పారు.
`మా తండ్రి మీద మాకు ప్రేమ లేదన్నట్లుగా ఆమె మాట్లాడటం నాకు బాధ కలిగించింది. ఆయన చనిపోయాక అసెంబ్లీకి వెళ్లిన మాట నిజమే.. మా తండ్రి కేడర్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే అంత బాధలోనూ అసెంబ్లీకి వెళ్లాను. అందుకు మెచ్చుకోకున్నా తోటి మహిళగా అర్థం చేసుకుంటే బాగుండేది` అని అఖిలప్రియ అన్నారు.
30 ఏళ్ల రాజకీయ జీవితంలో తన తల్లిదండ్రులు ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని, తాను కూడా చేయబోనని ఆమె పేర్కొన్నారు. సానుభూతి కోసం అమ్మానాన్నల ఫొటోలను ఉపయోగించుకున్నారనే విమర్శలపై స్పందిస్తూ - `జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి ఎలాగో, మాకు మా తండ్రి కూడా అలాగే. అయినా అలా ఉపయోగించుకుంటే తప్పేంటి?` అని అఖిలప్రియ ప్రశ్నించారు.
తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చారని, ఏదో కావాలని వచ్చినట్లు చిత్రీకరించి ఎత్తి చూపించడం సబబు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలకు తమ కుటుంబం అండగా ఉంటుందని అఖిలప్రియ తెలియజేశారు.