: జూలై నెలలో వంద కోట్లకు చేరుకున్న డిజిటల్ లావాదేవీలు
పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీల అవసరం బాగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్లుగానే వివిధ రకాల పద్ధతుల ద్వారా డబ్బు చెల్లించుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందులో భాగంగానే జూలై నెలలో చేసిన డిజిటల్ లావాదేవీల సంఖ్య వంద కోట్ల మార్కు దాటిందని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. చెక్ క్లియరింగ్, ఏటీఎం క్లియరింగ్, ఐఎంపీఎస్, యూపీఐ, భిమ్, రూపే, పీఓఎస్, ఈ-కామర్స్, ఆధార్ ఆధారిత చెల్లింపులు వంటి అన్ని రకాల డబ్బు చెల్లింపు మాధ్యమాల ద్వారా చేసిన డిజిటల్ లావాదేవీలు కలిపి 100 కోట్ల మార్కు చేరుకున్నట్లు ఎన్‌పీసీఐ ఎండీ ఏపీ హోటా తెలియజేశారు.
అలాగే ఇంకో మూడేళ్లలో ఒక రోజులోనే 100 కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌పీసీఐ ఆధారంగా 12 రకాల చెల్లింపు మాధ్యమాలను అందుబాటులో ఉంచినట్లు, మొబైల్ చెల్లింపులు, ఆధార్ ఆధారిత చెల్లింపులను ఎక్కువ మంది వినియోగిస్తున్నారని హోటా వివరించారు. మరోవైపు డిజిటల్ పేమెంట్స్ కమిటీ చైర్మన్ రతన్ వాటల్ మాట్లాడుతూ - 2016-17 సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు 55 శాతం పెరిగాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.