: భారత్-చైనా మధ్య ముదురుతున్న వివాదం... పరిమిత స్థాయి సైనిక చర్యకు సిద్ధమవుతున్న చైనా?


డోక్లాం వివాదం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తుందా? అమెరికా-ఉత్తరకొరియా మధ్య కంటే ముందు భారత్-చైనాల మధ్య యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అంటే చైనా గొంతు అవుననే చెబుతోంది. సాధారణంగా చైనా ఏదైనా దేశంతో కయ్యానికి కాలుదువ్వితే చైనా నేతల గొంతుగా అక్కడి పత్రికలు మాట్లాడుతాయి. ఆ తరువాత వాటి కథనాలకు అనుగుణంగా ప్రత్యర్థి దేశాల్లోని పత్రికలు కూడా స్పందిస్తాయి. దీంతో నయానో, భయానో చైనా ఆయా దేశాలను లొంగదీసుకుంటుంది. సరిహద్దు దేశాలతో అనుసరించే ఈ వ్యూహాత్మక ఎత్తుగడను చైనా ఇప్పుడు భారత్ పై ప్రయోగిస్తోంది. డోక్లాంలో రహదారి నిర్మాణం పేరుతో చొచ్చుకొచ్చిన చైనా సైన్యం తరపున అక్కడి పత్రికలు భారత సైన్యం చొచ్చుకొచ్చిందంటూ కథనాలు వండి వార్చాయి.

 ఆ తరువాత భారత్ వెనక్కి తగ్గాలని కొన్నిరోజులు, సైన్యాన్ని కుదించుకోవాలని మరికొన్ని రోజులు కథనాలు రాశాయి. వీటికి భారత మీడియా నుంచి ఏమాత్రం స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో చైనా పాత చైనా కాదని, అత్యంత శక్తిమంతమైన సైన్యం, ఆయుధాలు కలిగి వున్న దేశమంటూ బెదిరించే ప్రయత్నం చేసింది. దానికి కూడా ఇండియన్ మీడియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కేంద్ర ప్రభుత్వం తమ విధానం వివాదం కాదని, పరిష్కారానికి చర్చలే మార్గమని స్పష్టం చేసింది. దీంతో మొన్నటికి మొన్న భారత్ తోకముడిచిందని, భారత సైన్యాన్ని ఉపసంహరించుకుందని కథనాలు ప్రసారం చేసింది, దానికి కూడా ఎలాంటి స్పందన రాలేదు.

 ఈ నేపథ్యంలో చైనా అక్కడ రోడ్డు నిర్మిస్తే ఈశాన్య రాష్ట్రాలతో భారత్ కు సంబంధాలు తెగిపోతాయని భయపడుతోందని రెచ్చగొట్టే కథనాలు ప్రసారం చేసింది. దీనికి కూడా భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో అసహనంతో ఊగిపోయిన చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి రెన్ గ్వొకియాంగ్ మాట్లాడుతూ, స్పందించకుండా ఉంటే సమస్య నీరుగారిపోతుందన్న భావనలో భారత్ ఉందని, తమ సహనానికి కూడా హద్దు ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా భారత సైన్యంపై చైనా మరో రెండు వారాల్లో పరిమిత స్థాయి సైనిక చర్య చేపట్టే అవకాశముందని ఆ దేశ ప్రభుత్వరంగ వార్తాసంస్థ ‘గ్లోబల్‌ టైమ్స్‌’ కథనాన్ని ప్రసారం చేసింది. బలగాల ఉపసంహరణకు భారత్‌ సిద్ధపడకపోయిన పక్షంలో రెండు వారాల్లో స్వల్పస్థాయి సైనిక చర్యకు దిగే అవకాశముందని చైనా విదేశీ వ్యవహారాల నిపుణుడు హు ఝియోంగ్‌ అందులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News