: వర్షాల కోసం... ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకున్నారు!
తమ భార్యాపిల్లలు చూస్తుండగా ఇద్దరు మగవాళ్లు వివాహం చేసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రమేష్ సింగ్ తోమర్ వద్ద సక్రామ్ ఆశీర్వార్, రాకేశ్ అద్జన్ లు పని చేస్తున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో వరుణదేవుడు అనుగ్రహించాలంటూ కప్పలు, కుక్కలకు పెళ్లిళ్లు చేసినా ఫలితం లేకపోవడంతో లోకకల్యాణార్థమై వర్షాలు కురవాలంటూ సక్రామ్, రాకేష్ లు వివాహం చేసుకున్నారు.
ఈ పురుషుల వివాహ తంతును చూసేందుకు భారీ ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉత్సాహం చూపించారు. వివాహతంతు ముగిసిన తరువాత వారు మాట్లాడుతూ, వరుణ దేవుడు (ఇంద్రుడ్ని) వరుడిగా భావిస్తామని తెలిపారు. వివాహానంతరం తమతమ భార్యాపిల్లలను తీసుకుని ఎవరింటికి వారు వెళ్లిపోవడం విశేషం. కాగా, పెళ్లితంతు సమయంలో మబ్బులు పట్టిన ఆకాశం చివరికి ఒక్క చినుకు చుక్క కూడా రాల్చకుండానే కనుమరుగైంది.