: టీమిండియాకు శ్రీలంక టూర్ చిరస్థాయిగా గుర్తుండిపోతుంది!
విదేశాల్లో టీమిండియాకు మరీ అంత గొప్ప రికార్డు లేదు. స్వదేశంలో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని ఏ జట్టైనా అంగీకరిస్తుంది. అదే విదేశాలకు వెళ్లేసరికి టీమిండియాకు చేతులెత్తేసే అలవాటు ఉంది. గతంలో గంగూలీ, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలు ఉన్నప్పుడు టీమిండియా విజయాలు సాధించింది. అయినప్పటికీ భారీ స్కోరు చేసి, ప్రత్యర్థిని కట్టడి చేసి సాధించిన విజయాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఒక టెస్టులో భారీ స్కోరు సాధించినా, తరువాతి టెస్టులో ఆతిథ్య జట్టు పుంజుకునేది. అయితే తాజా శ్రీలంక పర్యటనలో టీమిండియా రెండు టెస్టుల్లో భారీ స్కోరు సాధించింది.
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 600 పరుగులు చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 240 పరుగులకు డిక్లేర్ చేసింది. తద్వారా రెండు ఇన్నింగ్స్ లలో 840 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా శ్రీలంక 536 పరుగులు చేసింది. దీంతో టీమిండియా తొలి టెస్టులో భారీ విజయం సాధించింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అదే సమయంలో శ్రీలంక 50 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. భారత జట్టులో అశ్విన్, జడేజా మంచి ఫాంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో లంక బ్యాటింగ్ ఆర్డర్ సవాళ్లను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో వరుసగా టెస్టుల్లో నిలకడగా భారీ స్కోర్లు చేస్తుండడంతో ఈ సిరీస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది.