: సూర్య కుమారి మా ఇంటికి వచ్చి పది నిమిషాలు కూర్చుంది... పోలీసులకు పూర్తిగా సహకరించాను: విద్యాసాగర్
కృష్ణా జిల్లా విజయవాడ, మాచవరంకు చెందిన వైద్యురాలు సూర్యకుమారి అదృశ్య మిస్టరీ వీడలేదు. ఐదురోజులుగా ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన అనుమానితుడు విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ, గత నెల 31వ తేదీ రాత్రి ఒంటి గంట సమయంలో సూర్యకుమారి తన ఇంటికి వచ్చిందని తెలిపారు. సుమారు పది నిమిషాలపాటు తన ఇంట్లో ఉన్న సూర్యకుమారి ముభావంగా కూర్చుందని చెప్పారు. అంతకుముందు పలు మార్లు పీజీ మెట్ పరీక్షలకు ఢిల్లీ వెళ్తానని చెప్పిందని ఆయన అన్నారు.
ఆ తరువాత కాసేపటికి తన ఇంట్లో ఆమె సెల్ ఫోన్ మర్చిపోయిన సంగతి గ్రహించానని, దానిని ఇచ్చేసేందుకు క్రీస్తురాజపురంలోని ఆమె ఇంటికి వెంటనే వెళ్లానని ఆయన చెప్పారు. మూడు రోజుల పాటు పోలీసు కస్టడీలో పూర్తిగా సహకరించానని ఆయన చెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఆమె ఇంట్లో ఏం జరిగిందో తనకు తెలియదని ఆయన అన్నారు. ఆమె ఆచూకీని పోలీసులే కనిపెట్టాలని సూచించారు.
మరోవైపు సూర్యకుమారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, లాకుల వద్ద శోధించామని చెప్పారు. ఏపీ 16సీహెచ్ 4576 వాహనం ఎక్కడ పెట్టిందన్నది తెలియడం లేదని, దాని ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని వారు కోరారు. అలాగే ఆమె సెల్ నెంబర్ల ఆధారంగా కూడా విచారణ ప్రారంభించామని వారు చెప్పారు.