: బాబా రాందేవ్‌పై పతంజలి మాజీ సీఈవో సంచలన వ్యాఖ్యలు.. సేవ పేరుతో ఉద్యోగులతో ఉచితంగా పని చేయించుకుంటున్నారని ఆరోపణ!


యోగా గురు బాబా రాందేవ్‌పై పతంజలి ఆయుర్వేద మాజీ సీఈవో ఎస్‌కే పత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.10,500 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్న పతంజలి కంపెనీలో ఉద్యోగులకు వేతనాలు అందడం లేదని, సేవ పేరుతో వారితో పని చేయించుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనీ విషయాలు వెల్లడించారు. సంస్థలోని ఉద్యోగులకు కంపెనీ చాలా తక్కువ మొత్తంలో చెల్లిస్తోందని తెలిపారు. బాబాజీ (బాబా రాందేవ్) దీనిని సేవగా పిలుస్తున్నారని వివరించారు.

తాను సీఈవోగా ఉన్నప్పుడు పతంజలి ఆయుర్వేద, పతంజలి ఫుడ్‌పార్క్‌లో ఒకేసారి రెండు విధులు నిర్వర్తించానని పేర్కొన్నారు. రెండు ఉద్యోగాలకు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని కానీ అలా జరగలేదన్నారు. పతంజలి సేవ కోసమే పుట్టిందని, ప్రస్తుతం ఆయన వేతనం తీసుకుంటున్నా, తర్వాత అది ఉండదని తనను ఉద్దేశించి పతంజలి ప్రకటించినట్టు తెలిపారు. పతంజలి అధికారిక వెబ్‌సైట్ కూడా ఇదే విషయాన్ని చెబుతుండడం గమనార్హం. పతంజలి ఉన్నది మానవ ‘సేవ’కేనని అందులో పేర్కొనడం పత్ర వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది.

తనకు వేతనం ఆపడంపై పత్రా పలుమార్లు బాబా రాందేవ్‌తో వాదనకు కూడా దిగారు. ‘‘నాకు వేతనం కావాలి. నా కోసం కాదు. నాకో కుటుంబం ఉంది. వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అందుకోసమైనా నాకు జీతం కావాలి’’ అని చాలాసార్లు బాబాను కలిసి వేడుకున్నట్టు చెప్పారు. దీంతో ముందు హామీ ఇచ్చినట్టు కాకుండా ఒక ఉద్యోగానికే వేతనం ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు మొత్తం కంపెనీలకు ఉచితంగా సేవలు అందించాలని తనను కోరారన్నారు.

  • Loading...

More Telugu News