: 'పోలీసు' దొంగలు... వ్యాపారిని బెదిరించి 25 లక్షల వజ్రాలు ఎత్తుకెళ్లారు!
దొంగలను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులే దొంగలై వజ్రాల వ్యాపారి నుంచి 25 లక్షల రూపాయల విలువైన వజ్రాలు దోచుకెళ్లిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ముంబైలో వజ్రవ్యాపారి జయేశ్ జవేరీ షాపుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తాము గుజరాత్ నుంచి వజ్రాలు అమ్మేందుకు వచ్చామని, తన పేరు రాజ్ అని, తాను వజ్రాల వ్యాపార ఏజెంట్ నని, తన తో పాటు వచ్చిన మహిళ తన పార్ట్ నర్ అని అతనికి చెప్పాడు. వారు ముగ్గురు మాట్లాడుతున్నంతంలో చంద్రకాంత్ ఘేవర్, సంతోష్ గవస్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడికి చేరుకున్నారు.
వారు వస్తూనే అక్రమ వజ్రాల వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ జయేశ్ పై చేయి చేసుకున్నారు. తానలా చేయడం లేదని ఎంత మొత్తుకున్నా వినకుండా షాపులోని 25 లక్షల రూపాయల విలువైన వజ్రాలతో సహా జయేశ్, రాజ్, అతనితో వచ్చిన మహిళను బలవంతంగా కారులో ఎక్కించారు. మార్గమధ్యంలో వారిని దించి, తరువాత ఫోన్ చేయండని చెబుతూ వజ్రాలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో అనుమానం వచ్చిన జయేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు, ఇద్దరు కానిస్టేబుల్స్ ను గుర్తించి, అరెస్టు చేశారు. రాజ్ కూడా ఈ పోలీసుల మనిషేనని తేలింది. పరారీలో ఉన్న రాజ్ కోసం గాలింపు చేపట్టారు.