: మెరీనా బీచ్ వద్ద శివాజీ గణేశన్ విగ్రహం తొలగింపుపై నటుడు కమల్ ఆగ్రహం!
చెన్నైలోని మెరీనా బీచ్ తీరంలో ఉన్న నాటి ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ విగ్రహాన్ని తొలగించడంపై విలక్షణ నటుడు కమలహాసన్ మండిపడుతున్నారు. తమిళుల హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న, తండ్రి లాంటి వ్యక్తి అయిన శివాజీ గణేశన్ కంటే ప్రభుత్వం గొప్పదేమీ కాదని, ఆయన కోసం మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానిని జీవితాంతం కాపాడుకుందామని అన్నారు.
కాగా, ఈ విగ్రహం కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని, దానిని తొలగించాలని కోరుతూ గాంధేయవాది శ్రీనివాసన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విగ్రహాన్ని తొలగించాలని కోర్టు తీర్పు వెలువరించడంతో గురువారం తెల్లవారుజామున ఈ విగ్రహాన్ని తొలగించి, అడయార్ లోని స్మారక మండపానికి తరలించారు.