: డ్రగ్ లేడీ డాన్ సంగీత ఉచ్చులో బడాబాబుల పిల్లలు... విచారణలో వెలుగు చూసిన నిజాలు
నైజీరియన్లతో సంబంధం పెట్టుకుని డ్రగ్స్ దందాతో పాటు వ్యభిచార గృహం నడిపిన విజయవాడ సంగీతను విచారించిన పోలీసులు పలు కీలక విషయాలను ఆమె నుంచి రాబట్టినట్టు తెలుస్తోంది. ఓ వైపు డ్రగ్స్, మరోవైపు వ్యభిచారంతో ఆమె యువతకు గాలమేసిందని, ఆమె ఉచ్చులో ఎంతో మంది బడాబాబుల పిల్లలు ఉన్నారని తేల్చిన పోలీసులు, వారందరినీ విచారిస్తున్నారు.
రాచకొండ పోలీసు వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు, విజయవాడకు చెందిన పాలకుర్తి సంగీతకు పెళ్లయిన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. ఆపై ఓ కాల్ సెంటర్ లో ఆమె పనిచేయగా, ఆ సమయంలో సూడాన్ కు చెందిన యువతి పరిచయం అయింది. కొంత కాలం తరువాత సంగీత తన మకాంను విజయవాడ నుంచి హైదరాబాద్ కు మార్చింది. సూడాన్ యువతి ద్వారా నైజీరియాకు చెందిన ఒజుకు కాస్మోస్ తో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో అతను, అతని స్నేహితులతో కలిసుంటూ, బండ్లగూడలోని సన్ సిటీలో ప్లాట్ ను అద్దెకు తీసుకుంది. వారు తెచ్చిచ్చే కొకైన్, బ్రౌన్ షుగర్, ఆంఫిటమైన్ లను యువతకు విక్రయించేది. ఆమెకు నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న జాన్, సిరిల్ అనే నైజీరియా విద్యార్థులు సహకరించేవారు. ఆమె పేరిట బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించిన కాస్మోస్ తమ దందాకు ఆ బ్యాంకు ఖాతానే వాడారు. కొందరు నైజీరియన్లు డ్రగ్స్ అమ్ముతున్నారన్న సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు ఎల్బీ నగర్ బస్టాపు వద్ద సంగీతను, జాన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆపై వారిచ్చిన సమాచారంతో పలు ప్రాంతాల్లో దాడులు చేసి మిగతా నిందితులను అరెస్ట్ చేశారు.