: నంద్యాల ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్... అభ్యర్థి ఖరారు!
నంద్యాల ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నిక కావడంతో... ఈ ఎన్నికలో గెలుపును టీడీపీ, వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలో గెలుపొందితే... 2019లో అధికార పీఠం తమదే అనే భావనతో, ఇరు పార్టీలు గెలుపు కోసం సర్వ శక్తులను ఒడ్డుతున్నాయి.
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల బరిలోకి దిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో, ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా ఎన్నికల్లో తమ అభ్యర్థిని ప్రకటించింది. తమ అభ్యర్థిగా మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ ఖాదర్ ను బరిలోకి దించింది. ఈ నెల 5వ తేదీన అబ్దుల్ ఖాదర్ నామినేషన్ వేయనున్నారు. అబ్దుల్ నామినేషన్ వేసే కార్యక్రమానికి మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.