: చైనా వివాదం నేపథ్యంలో నావికా దళాన్ని శక్తిమంతం చేస్తున్న భారత్!
చర్చలకు ఒప్పుకోకుండా రోజుకో విధంగా హెచ్చరికలు చేస్తున్న చైనా ఆగడాలను దృష్టిలో ఉంచుకుని నావికా దళాన్ని బలపరిచే పనిలో భారత్ నిమగ్నమైంది. ఇందులో భాగంగా శత్రువులకు దొరక్కుండా భీకర దాడి చేయగల ఐఎన్ఎస్ కల్వారి సబ్‌మెరైన్‌ను రంగంలోకి దించారు. 2005లో చేసుకున్న 3.7 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా మాజ్‌గావ్ డాక్‌తో కలిసి ఫ్రెంచ్ నేవీ సంస్థ నిర్మిస్తున్న ఆరు సబ్‌మెరైన్లలో ఐఎన్ఎస్ కల్వారి మొదటిది. భారత దేశ రక్షణలో భాగంగా హిందూ మహాసముద్రంలో భారత సబ్‌మెరైన్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. ప్రస్తుతం భారత్ దగ్గర కేవలం 15 సబ్‌మెరైన్లు మాత్రమే ఉన్నాయి.
అదే చైనా నావికా దళంలో దాదాపు 60 సబ్‌మెరైన్లు ఉన్నట్లు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ రిపోర్ట్‌లో తేలింది. అంతేకాకుండా చైనా కూడా హిందూ మహాసముద్రంలో తమ సబ్‌మెరైన్లను దింపిందని, అవి రాడార్‌కు కూడా చిక్కడం లేదని సమాచారం. అలాగే పాకిస్థాన్ కూడా ఈ మధ్య న్యూక్లియర్ సబ్‌మెరైన్ల కొనుగోలుపై దృష్టి సారించిన నేపథ్యంలో జలాంతర మార్గాల్లో భారత్‌కు యుద్ధ ప్రమాదాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం, యుద్ధం గురించిన నిర్లక్ష్యాల కారణంగా నావికా దళాన్ని శక్తిమంతం చేసుకోవడంలో భారత్ విఫలమైందని రక్షణ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా వీలైనంత త్వరగా భారత నావికా దళాన్ని బలపరిచే ప్రయత్నాలు చేయాలని వారు సూచిస్తున్నారు.