: ఆపవయ్యా... ఇది కోర్టా? టీవీ స్టూడియోనా?: ప్రభుత్వ న్యాయవాదికి చివాట్లు పెట్టిన న్యాయమూర్తి
కాశ్మీరీ వేర్పాటు వాద నేత షాబిర్ షాను మరిన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తున్న వేళ, ఆయన మాటలు న్యాయమూర్తికి కోపం తెప్పించాయి. షాబిర్ షాను ఉద్దేశించి మాట్లాడుతూ, "నువ్వు నిజంగా దేశ భక్తుడివే అయితే, భారత్ మాతాకీ జై అని గట్టిగా అరువు" అని సవాల్ విసరడంతో, విస్తుపోయిన న్యాయమూర్తి, 'ఏంటిది? ఇదేమైనా టీవీ స్టూడీయోనా? కోర్టు హాలా?' అని చివాట్లు పెట్టారు. సవాళ్లు మానేసి పాయింట్ చెప్పాలని గడ్డిపెట్టారు.
కాగా, జూలై 25న పోలీసులు అరెస్ట్ చేసిన షాబిర్ షా, తమ విచారణలో సహకరించడం లేదని, అతన్నుంచి నిజాలను రాబట్టేందుకు మరిన్ని రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ వేయగా, కేసు విచారణ సందర్భంగా ఈ ఘటన జరిగింది. తన క్లయింటును నేరం ఒప్పుకోవాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఒత్తిడి చేస్తోందని షా తరఫు న్యాయవాది ఆరోపించారు. వాదనలు విన్న న్యాయస్థానం, ఆరు రోజుల కస్టడీకి అనుమతిస్తూ తీర్పిచ్చింది.