: భారత్ యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది...: చైనా ఆరోపణ!
గత నెలన్నర రోజులుగా భారత్ - చైనాల మధ్య వివాదాస్పదంగా మారిన డోక్లాం సరిహద్దు ప్రాంతంలో రోడ్లు బాగుచేయడం, బలగాలను మోహరించడం వంటి పనులు చేపడుతూ భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తోందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. `చైనా భూభాగంలో భారత్ సైన్యం అక్రమంగా ప్రవేశించడమే కాకుండా తమ వైపు భాగంలో బలగాలను మోహరిస్తోంది. ఇది నిజంగా శాంతి కోసం మాత్రం కాదు` అని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.
చైనా ఆరోపణలను భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఖండించారు. దీనిపై ఆమె పార్లమెంట్‌కు లిఖితపూర్వక సమాధానం అందజేశారు. `భారత్ ఎప్పుడూ ఇరు దేశాల మధ్య శాంతి సమన్వయాన్నే కోరుకుంటుంది. మన మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా సాగాలంటే అలాగే ఉండాలి. అందుకు భారత్ కట్టుబడి ఉంది. ఈ డోక్లాం సమస్యకు ఇరు దేశాల ప్రతినిధులు చర్చించడం ద్వారానే సమాధానాన్ని వెతికే ఆలోచనలో భారత్ ఉంది` అని సుష్మా లేఖలో పేర్కొన్నారు.