: మీ ఐఫోన్‌కు కవర్ వాడుతున్నారా? జర భద్రం!.. వేలాది కవర్లను వెనక్కి పిలిపించిన ఆపిల్!
అద్భుతమైన రంగుల్లో ఆకట్టుకునేలా ఉన్న కవర్లను మీ ఐఫోన్‌కు వాడుతున్నారా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాటిని వాడుతున్న వారు కెమికల్ బర్న్స్‌కు గురవుతుండడంతో వేలాది కవర్లను కంపెనీ వెనక్కి తెప్పించింది. దాదాపు రెండు డజన్ల మంది శరీరంపై గాయాలు కావడంతో సంస్థ వినియోగదారులను అప్రమత్తం చేసింది. కవర్ లోపల ఉండే లిక్విడ్ కారణంగా శరీరంపై గాయాలు అవుతున్నట్టు అమెరికన్ కన్జ్యుమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 24 మంది రసాయన గాయాల బారిన పడినట్టు పేర్కొంది.
మిక్స్‌బిన్ అనే కంపెనీ తయారుచేస్తున్న ఈ ఐఫోన్ కవర్లను విక్టోరియా సీక్రెట్, టోరీ బరచ్ తదితర ప్రఖ్యాత బ్రాండ్ల పేర్లతో వీటిని విక్రయిస్తున్నారు. వీటిలో చాలా వరకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా విక్రయిస్తున్నారు. అక్టోబరు 2015-జూన్ 2017 మధ్య 2.63 లక్షల కవర్లు విక్రయించినట్టు అంచనా.