: 'దొంగతనం జరిగిందని బాధపడవద్దు... దేవుడు మీకు ఇస్తాడు' అంటూ ఓదార్పు లేఖ రాసిపెట్టి దోచుకున్న దొంగ!
నిజామాబాద్ జిల్లాలో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఇంటిని దోచుకున్న ఓ దొంగగారు నీతులు చెప్పి మరీ వెళ్లిపోయాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే... నిజామాబాద్ జిల్లా నాందేవ్ వాడలో సురకుట్ల భాస్కర్ నివాసం ఉంటున్నాడు. ఆయన తండ్రి చిన్నయ్య ఇటీవల మృతి చెందారు. దీంతో సంప్రదాయంలో భాగంగా నిద్ర కోసం అదే ప్రాంతంలోని ఆర్యనగర్ లోని తమ నివాసానికి ఆయన అత్తగారు తీసుకెళ్లారు.
దీనిని అదనుగా భావించిన దొంగ ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలోని 20 తులాల బంగారం, 28,000 రూపాయల నగదు దోచుకెళ్లిపోయాడు. అనంతరం 'దొంగతనం జరిగిందని బాధపడవద్దు, దేవుడు మీకు ఇస్తాడు, చూస్తూ ఉండండి' అంటూ ఓ లేఖను పెట్టి మరీ వెళ్లిపోయాడు. నిద్రముగించుకుని ఇంటికి వచ్చిన భాస్కర్ జరిగింది చూసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.