: గ్లోబల్ టాప్ 20లో భారత విద్యా సంస్థ ఒక్కటీ లేదు: మానవ వనరుల శాఖ
వివిధ అంతర్జాతీయ నివేదికల ప్రకారం అంతర్జాతీయ ప్రమాణాలను పాటించే గ్లోబల్ టాప్ 20 జాబితాలో భారతదేశానికి చెందిన ఒక్క విద్యా సంస్థ కూడా లేదని మానవ వనరుల శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని రాజ్యసభలో మానవ వనరుల శాఖ సహాయ మంత్రి మహేంద్ర నాథ్ పాండే లిఖిత పూర్వకంగా సమర్పించారు. దేశంలో ఉన్నత విద్యలో ప్రభుత్వం పాటిస్తున్న నాణ్యత గురించి సభలో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
విద్యా నాణ్యతను పెంపొందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రకటించారు. సాంకేతిక విద్యాభివృద్ధి మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. అందుకు తగిన విధంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారికి నియమావళి పంపించినట్లు ఆయన వివరించారు. అలాగే ఉన్నత విద్యలో సంస్కరణలు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా మార్గదర్శకాలు జారీ చేసినట్లు మహేంద్ర నాథ్ పాండే తెలియజేశారు. ఇందుకోసం రూ. 300 కోట్లు కేటాయించిందని సహాయ మంత్రి పేర్కొన్నారు.