: ఇద్దరు పిల్లల తల్లికి నరకం చూపించిన దుబాయ్ ఎయిర్‌లైన్స్... ఫేస్‌బుక్‌లో వెల్లడించిన బాధితురాలు
దుబాయ్‌కి చెందిన ఇత్తేహాద్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఏ మాత్రం కనికరం లేకుండా తనకు 7 గం.ల పాటు నరకం చూపించారని, ఇక ముందు ఆ ఎయిర్‌లైన్స్‌లో ఎవరూ ప్రయాణించవద్దని ఓ మహిళ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది. అమెరికాలో నివాసముండే మోహనా రే కుటుంబం సెలవులకు భారత్ వచ్చింది. పని ఉండటంతో ఆమె భర్త ముందే అమెరికా వెళ్లిపోయాడు. తర్వాత తను ఇద్దరు ఆడపిల్లలతో ఒంటరిగా కోల్‌కతా నుంచి అమెరికా వెళ్లడానికి సిద్ధమైంది. ప్రయాణం చేసి అలసిపోవడం వల్ల తన పెద్దకూతురు ఓలితాకు కొద్దిగా జ్వరం వచ్చింది. అమెరికా వెళ్లేందుకు యూఏఈ ఎయిర్‌పోర్ట్‌లో విమానం మారాలి. పాపకు జ్వరం ఉన్న కారణంగా అమెరికా వెళ్లే విమానం ఎక్కడం కుదరదని ఇత్తేహాద్ ఎయిర్‌లైన్స్ వారు ఆమెను అడ్డుకున్నారు.
తర్వాత జ్వరంతో ఉన్న పాపను పట్టుకుని మెడికల్ క్లియరెన్స్ కోసం ఆమె ప్రయత్నిస్తున్నా ఎవరూ తనని పట్టించుకోలేదని, పైగా కొంతమంది సిబ్బంది తనతో కరుకుగా మాట్లాడారని, ఏ మాత్రం కనికరం చూపించలేదని ఆమె పోస్ట్‌లో పేర్కొంది. విమానం ఎక్కడానికి ముందు, పాప జ్వరం తగ్గేవరకు కల్పిస్తామని చెప్పిన సౌకర్యాలు కూడా ఇత్తేహాద్ వారు అందుబాటులో ఉంచలేదని, ఎయిర్‌పోర్ట్‌లో నేల మీద పడుకున్నామని ఆమె తెలియజేసింది. సిబ్బందిలో ఇద్దరు ముగ్గురు మంచివాళ్లు ఉండటంతో తాము అక్కడి నుంచి బయటపడగలిగామని, ఇంకెప్పుడూ ఇత్తేహాద్ ఎయిర్‌లైన్స్ లో ప్రయాణం చేయనని, తన స్నేహితులను కూడా చేయవద్దని ఆమె పోస్ట్‌లో కోరింది. పాపకు మామూలు జ్వరమే కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరిగి ఉంటే ఎవరిది బాధ్యత? అని మోహనా ప్రశ్నించింది. ఈ పోస్ట్ చదివిన నెటిజన్లు ఇత్తేహాద్ ఎయిర్‌లైన్స్ సేవల విషయంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం తప్పని విమర్శించారు.