: భారతీయులు ముద్దులు పెట్టుకోరు... బూతులు మాట్లాడరు: సెన్సార్ పై హీరోయిన్ ఎద్దేవా
‘బాబూమోషై బందూక్ బాజ్’ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డ్ 48 కట్స్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ చిత్ర యూనిట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కళను, కళాత్మకతను చూడకుండా సెన్సార్ కట్ లు చెప్పిందని, ఇన్ని కట్స్ తో సినిమాను ఎలా విడుదల చేస్తామని చిత్రయూనిట్ వాపోయింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడానికా? లేకపోతే కళను చంపేయడానికా? అన్న చర్చ మరోసారి బాలీవుడ్ లో రాజుకుంది. అయితే సెన్సార్ నిబంధనల మేరకే కట్స్ చెప్పామని సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ చెబుతున్నారు. ఈ సినిమాను 28న విడుదల చేయాలని యూనిట్ గతంలో నిర్ణయించింది.
అయితే సెన్సార్ తీరుతో సినిమా విడుదల వాయిదా పడేలాఉంది. అంతే కాకుండా ఈ సిన్నివేశాలను మరోసారి షూట్ చేయడమో లేక, న్యాయస్థానానికి వెళ్లి పోరాడడమో చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి నవాజుద్దీన్ సిద్ధికీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, అతనికి జతగా నటించిన బిదిత బగ్ తన ఇన్ స్టా గ్రాంలో ‘‘భారతీయులు ముద్దులు పెట్టుకోరు, భారతీయులు బూతులు మాట్లాడరు’’ అంటూ ఎద్దేవా చేసింది. దీనికి ‘సంస్కారి’, ‘సీబీఎఫీసీ’ అనే హాష్ ట్యాగ్ లు జోడించారు. ఎక్కువ సామాజిక చిత్రాల్లో నటించే బిదిత, కామెడీ, రొమాన్స్ ప్రధానంగా రూపొందిన ‘బాబూమోషై బందూక్ బాజ్’ లో కాంట్రాక్ట్ కిల్లర్ గా నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రేయసిగా నటించింది.