: ప్రణబ్ దా... మీరు నాకు తండ్రితో సమానం: మాజీ రాష్ట్రపతికి ప్రధాని మోదీ లేఖ

`మూడేళ్ల క్రితం నేను ఢిల్లీ వచ్చాను. నా ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి. వాటిని సాధించడంలో ఒక తండ్రిలా మీరు నా వెంటే ఉన్నారు` అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తనకు రాసిన లేఖను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్రపతిగా తన చివరి రోజున మోదీ రాసిన ఈ లేఖ తన మనసును హత్తుకుందని ప్రణబ్ పేర్కొన్నారు. `వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందినా, భావనలు వేరైనా, మీ వివేకం వల్లనే మనం కలిసి పని చేయగలిగాం. మీ మార్గదర్శకం, వ్యక్తిగత ఆత్మీయతలు నాలో నమ్మకాన్ని పెంపొందించాయి. మీరు ఒక జ్ఞాన నిధి. మీ తెలివితేటలు, బుద్ధి కుశలత నాకు, నా ప్రభుత్వానికి అండగా ఉన్నాయి.` అని మోదీ లేఖలో పేర్కొన్నారు.
ప్రణబ్ స్వార్థం లేకుండా ప్రజలకోసం పాటుపడే రాజకీయ నాయకుల కోవకు చెందినవారని, ఆయన లాంటి రాష్ట్రపతిని పొందినందుకు దేశం గర్వపడుతుందని మోదీ లేఖలో తెలియజేశారు. అలాగే ప్రభుత్వ పాలనలో తనకు అండగా ఉన్నందుకు మోదీ కృతజ్ఞతలు చెప్పారు. భవిష్యత్తులో కూడా దేశ అభివృద్ధిలో తనకు మార్గదర్శకం చేయాలని ఆయన ప్రణబ్‌ను కోరారు. ప్రణబ్ ట్వీట్ చేసిన లేఖపై కూడా మోదీ స్పందించారు. `ప్రణబ్ దా.. మీతో పనిచేయడం నాకు ఎప్పటికీ ఆనందమే!` అని మోదీ ట్వీట్ ద్వారా బదులు చెప్పారు.