: అనంతపురం జిల్లాలో మరో ఫ్యాక్షన్ హత్య.. నెత్తురుతో తడిసిన వేటకొడవళ్లు!
అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ భూతం మరోసారి పంజా విసిరింది. వేట కొడవళ్లు మరోసారి రక్తంతో తడిశాయి. కల్యాణదుర్గం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ బాదన్నను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాదన్నను రక్షించేందుకు, ఆయనను అనంతపురం ఆసుపత్రికి తీసుకువచ్చినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. మంత్రి కాల్వ శ్రీనివాసులు, కల్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి బాదన్న ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. గతంలో ఈయన వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ కూడా వ్యవహరించారు.
కొన్ని రోజుల క్రితం ఆయన సమీప బంధువుతో బాదన్నకు ఓ విషయంలో గొడవ జరిగిందని... వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కూడా జరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ హత్య వెనుక ఈ గొడవకు సంబంధించిన నేపథ్యం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా, పాత కక్షలతో ఈ హత్య జరిగిందా? అని కూడా దర్యాప్తు చేస్తున్నారు. బాదన్న హత్యతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.