: నా కొడుకు అమెరికా వల్ల చెడిపోయాడు... నాపై కేసు పెడతాడేమోనని భయమేస్తోంది!: జాకీ చాన్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా సంప్రదాయాలపై ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీ చాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామెడీ యాక్షన్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జాకీ చాన్ పాశ్చాత్య సంస్కృతి తన కుమారుడ్ని చెడగొట్టిందని అన్నారు. చైనా మీడియాతో ఆయన మాట్లాడుతూ, తన తండ్రి తనను ఎంతో కష్టపడి, క్రమశిక్షణతో పెంచారని అన్నారు. కేవలం ఇంట్లోనే కాకుండా హోటల్ కి వెళ్లినా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన నేర్పినట్టే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అలవాటైందని ఆయన తెలిపారు.
ఇంట్లోకి వెళ్లేటప్పుడు చెప్పులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా తలుపుపక్కనే సర్దేవారమని అన్నారు. తన కుమారుడు మాత్రం ఈ నిబంధనలు పట్టించుకోడని జాకీ తెలిపారు. తన కుమారుడు ఇంటికి వచ్చేటప్పుడు షూస్ ఎలా పడితే అలా విసిరేస్తుంటాడని చెప్పాడు. షూస్ తో ఇంట్లోకి వచ్చేస్తాడని అన్నారు. పెద్దలతో మాట్లాడేటప్పుడు నిలబడి సీట్ ఇవ్వడం పెద్దరికమని, కానీ తన కుమారుడు అలా చేయడని, పైగా ఎలా పడితే అలా మాట్లాడేస్తాడని చెప్పారు. తన కుమారుడ్ని అమెరికా సంస్కృతి, సంప్రదాయాలు చెడగొట్టాయని ఆయన స్పష్టం చేశారు. పోనీ వాడిని సరైన మార్గంలో పెడదామంటే తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగిస్తున్నానని తనపై కేసుపెడతాడేమోనని భయంగా ఉందని చెప్పి, ఆయన అందర్నీ నవ్వించారు.