: తప్పిపోయిన పిల్లలను అక్కున చేరుస్తున్న `ఆధార్`
ఆధార్ కార్డు కేవలం గుర్తింపు కోసమే కాదు తప్పిపోయిన పిల్లలను అక్కున చేర్చడానికి కూడా ఉపయోగపడుతుందని ఇటీవల హర్యానా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. హర్యానాకు చెందిన తొమ్మిదేళ్ల గౌరవ్ 2015లో తప్పిపోయాడు. తర్వాత ఢిల్లీలోని పాల్నా స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందాడు. గౌరవ్‌కు ఆధార్ ఇప్పించడం కోసం స్వచ్ఛంద సంస్థ సిబ్బంది ప్రయత్నించారు. ఆధార్ డేటాబేస్‌లో గౌరవ్ వేలిముద్రలు ఇంతకుముందే భద్రపరిచి ఉండటంతో కొత్తగా నమోదు చేయడం కుదరలేదు. దీంతో గౌరవ్‌కు సంబంధించిన పాత ఆధార్ వివరాల ఆధారంగా అతని తల్లిదండ్రుల ఆచూకీ కనిపెట్టి సమాచారం తెలియజేశారు. రెండేళ్ల తర్వాత తమ కుమారుణ్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆధార్ తమ కుమారుణ్ని అక్కున చేర్చిందని కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇటువంటి సంఘటనే చత్తీస్‌గఢ్‌లో కూడా జరిగింది. 2013లో ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర్ రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన మూగ, బధిర బాలుణ్ని ఆధార్ తన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. బాలల సంరక్షణ కేంద్రంలో బాలుడికి ఆధార్ ఇప్పించేందుకు ప్రయత్నించగా, ఇంతకుముందే ఉన్న బయోమెట్రిక్ డేటా కనిపించడంతో పిల్లాడి వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇలా ఆధార్ గుర్తింపు కార్డుగా మాత్రమే కాకుండా తప్పిపోయిన తమ పిల్లలను కూడా దగ్గరికి చేర్చేందుకు ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.