: కాపు నేత ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్!
కాపు నేత ముద్రగడ పద్మనాభం 'ఛలో అమరావతి' పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. పాదయాత్రకు బయల్దేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. నేటితో ఆయనకు విధించిన గృహ నిర్బంధం ముగిసింది. దీంతో, తన అనుచరులు, మద్దతుదారులతో కలసి ఆయన తన నివాసం నుంచి బయటకు వచ్చారు. పాదయాత్రకు బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పాదయాత్రకు బయల్దేరిన ఆయనకు 2009 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పోలీసులు చూపించారు. అయితే, గతంలో చంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు సంబంధించిన 2014 గైడ్ లైన్స్ ను చూపించాలని పోలీసులను ముద్రగడ కోరారు. చంద్రబాబుకు అనుమతిని ఇచ్చినవారు, తనకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పోలీసులు తన పాదయాత్రను అడ్డుకోవడంతో... ఆయన తిరిగి తన నివాసంలోకి వెళ్లిపోయారు. అయితే, తన యాత్రకు అనుమతి ఇచ్చేంతవరకు తన ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై ముద్రగడ మండిపడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాదయాత్రను అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. తనది నిరవధిక పాదయాత్ర అని... ఎట్టి పరిస్థితుల్లోను వాయిదా వేయబోనని చెప్పారు. మంజునాథ కమిటీ పేరుతో కాపుల రిజర్వేషన్ల విషయంలో కాలయాపన చేస్తున్నారని అన్నారు.