: కాంగ్రెస్ హయాంలోనే డ్రగ్స్, పబ్బులు, గబ్బుల సంస్కృతి వచ్చింది: సీఎం కేసీఆర్
కాంగ్రెస్ హయాంలోనే డ్రగ్స్, పబ్బులు, గబ్బుల సంస్కృతి వచ్చిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే ఒక్క పనినీ హర్షించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా పనికి మాలిన కేసులను కాంగ్రెస్ నాయకులు పెడుతున్నారని, విద్యుత్ ఉద్యోగుల విలీనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు వాళ్ల ఉసురు పోసుకున్నారని అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై ఇప్పటికే 164 కేసులు పెట్టారని, సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలనూ వాళ్లు అడ్డుకున్నారని, తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.
ఈ నెల 10న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి శంకుస్థాపన చేసిన తర్వాత రాష్ట్రమంతటా తిరుగుతానని చెప్పారు. అప్పుడు, కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలను ప్రజల ముందు పెడతానని అన్నారు. తెలంగాణ పిశాచి కాంగ్రెస్ అని, నడిబజార్ లో కాంగ్రెస్ పార్టీ దుర్నీతిని ఎండగడతామని అన్నారు. మూడేళ్ల నుంచి తాము నిబద్ధతతో పని చేస్తుంటే..కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాత్రం సొల్లు పురాణం చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసే ప్రతి వ్యాఖ్యపై తాము స్పందిస్తే బాగోదని వదిలేస్తుంటే.. పిచ్చికూతలు కూస్తున్నారని, మనుషుల్లా కాకుండా, ఉన్మాదుల్లా కాంగ్రెసోళ్లు ప్రవర్తిస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు.