: ‘బిగ్ బాస్’కు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉండేది: సింగర్ మధుప్రియ
‘బిగ్ బాస్’ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ షోకు వచ్చినప్పుడు తమకు చాలా ఆనందంగా ఉండేదని ఆ షో నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ మధుప్రియ చెప్పింది. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బిగ్ బాస్’ అనుభవాలను మధుప్రియ చెబుతూ, ‘బిగ్ బాస్’ టీమ్ లో 14 మంది ఉండేవారని, హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు పదిహేనో వ్యక్తిని చూస్తున్నామనే ఆనందం కలిగేదని చెప్పింది. ‘బిగ్ బాస్’ షో లో పాల్గొనడానికి ముందు, పాల్గొన్న తర్వాత అనుభవం గురించి ప్రశ్నించగా.. ‘ఎంతో టెక్నాలజీ ఉన్న ప్రపంచానికి దూరంగా ఉన్నాము కదా! ఈ షోలో పాల్గొన్న తర్వాత ఎక్కడున్నా బతకగలను అని నేర్చుకున్నాను. అమ్మో! సెల్ ఫోన్ లేకుండా ఎలా ఉండగలగడమని ‘బిగ్ బాస్’ కు వెళ్లే ముందు అనుకున్నాను. ఇప్పుడు అలవాటైపోయింది. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలని.. దేవుడు నన్ను ఎక్కడ పడేసినా బతకగలననే విశ్వాసం నాకు వచ్చింది’ అని మధుప్రియ చెప్పుకొచ్చింది.