: నాకు నచ్చని మాటల్లో సమ్మె ఒకటి!: రజనీకాంత్
సమ్మె కారణంగా తమిళ చిత్రాల షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తనకు నచ్చని మాటల్లో సమ్మె ఒకటని, ఏదైనా సమస్య ఉంటే, మన అహంను పక్కనబెట్టి ప్రజల బాగు గురించి ఆలోచిద్దామని అన్నారు. చర్చల ద్వారా పరిష్కారమార్గాన్ని కనుక్కోవచ్చని, ఓ సీనియర్ నటుడిగా దక్షిణ భారత చలనచిత్ర కార్మికుల సంఘాల సమాఖ్య (ఫెప్సీ), తమిళ నిర్మాతల మండలికి తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. పెప్సీ, నిర్మాతల మండలి పెద్దలు ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని సూచించారు.
కాగా, రంజిత్ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందుతున్న కాలా చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి నిలిచిపోయింది. ఈ షూటింగ్ నిమిత్తం చెన్నైలో ప్రత్యేక సెట్ కూడా వేశారు. సమ్మె కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో, ముంబయి నుంచి కొత్త బృందాన్ని తెప్పించే పనుల్లో కాలా చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది.