: భారత్ ను హిందూ దేశంగా మార్చాలనేది మోదీ టార్గెట్: వీహెచ్
సెక్యులర్ దేశమైన భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. అందుకే, దేశంలో విపక్షమే లేకుండా చేసేందుకు ఆయన యత్నిస్తున్నారని అన్నారు. మోదీ కుట్రలో బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా భాగస్వామి అయ్యారని తెలిపారు. మోదీకి వ్యతిరేకంగా మిగిలిన అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
దేశం మొత్తం తిరిగి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి తెలంగాణలోనే తొలి సభ పెడతామని... ఆ సభకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆహ్వానిస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామని తెలిపారు. తెలంగాణ ఇన్ ఛార్జ్ గా వస్తున్న కుంతియా సమర్థుడా? కాదా? అనే విషయం ఆరు నెలల్లో తేలిపోతుందని చెప్పారు.