: సీఎం కేసీఆర్ ఇష్టానుసారం ప్రవర్తిస్తే ప్రజలు ఊరుకోరు: రేవంత్ రెడ్డి
ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ తన ఇష్టానుసారం ప్రవర్తిస్తే ప్రజలు ఊరుకోరని తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ఉద్యాన వర్శిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఈ రోజు ఆయన తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అర్ధరాత్రి సమయంలో హాస్టళ్లలోకి ప్రవేశించి విద్యార్థులపై దౌర్జన్యం చేయడం, అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వానికి తగదని అన్నారు. ఉద్యాన వర్శిటీ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఉద్యానవర్శిటీ విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు నిరసన తెలపాలని పిలుపు నిచ్చారు. అయితే, రేవంత్ రెడ్డి అక్కడ ఉంటే ఆందోళన ఉద్ధృతం అవుతుందని భావించిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.