: అత్యాచారానికి గురైన తరువాత ధైర్యవంతురాలిని అయ్యా: మిస్ ఆస్ట్రేలియా అలీ శాన్ ఫోర్డ్,
గత సంవత్సరం ఆస్ట్రేలియా అందాల రాణిగా ఎంపికైన అలీ శాన్ ఫోర్డ్, తన జీవితంలో ఎదురైన షాకింగ్ విషయాలను గురించి తొలిసారిగా మీడియాకు వెల్లడించింది. తన టీనేజ్ వయసులో అత్యాచారానికి గురయ్యాయనని, ఆ ఘటన తనను మరింత ధైర్యవంతురాలిని చేసిందని చెప్పుకొచ్చింది. కొన్నేళ్ల క్రితం స్నేహితులతో పార్టీ చేసుకున్న వేళ, ఓ అపరిచితుడు తనకు వోడ్కా, ఆరంజ్ డ్రింగ్ ను ఆఫర్ చేశాడని, ఆపై తనకు నెమ్మదిగా మగత కమ్మడంతో తనపట్ల దారుణంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.
ఘటన జరిగిన ఐదేళ్ల తరువాత విషయాన్ని తన తండ్రికి, ఆపై మరో ఏడాది తరువాత తల్లికి విషయం చెప్పానని, ఆ సమయంలో వారు తనకెంతో మద్దతుగా నిలిచారని అంది. జరిగిన దారుణం నుంచి బయటపడటానికి స్నేహితులు సహకరించారని, వారిచ్చిన ధైర్యంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని వెల్లడించింది. ఈ తరహా ఘటనలను ఎదుర్కొన్న అమ్మాయిలు, మరింత కుంగిపోకూడదన్న ఉద్దేశంతోనే విషయాన్ని అందరి ముందూ చెబుతున్నానని అలీ శాన్ ఫోర్డ్ పేర్కొంది.