: తనను తాను కాల్పించుకున్న విక్రమ్ గౌడ్ అరెస్ట్!
అప్పుల బాధ నుంచి బయటపడేందుకు తన తండ్రి, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ నుంచి డబ్బులు రాబట్టాలన్న ఉద్దేశంతో తనపై తానే హత్యాయత్నం చేయించుకున్న విక్రమ్ గౌడ్ ను కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ కు సహకరించిన షార్ట్ షూటర్ రియాద్ సహా, మరో ఐదుగురిని ఇదివరకే అరెస్ట్ చేసిన పోలీసులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న విక్రమ్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు.
ఈ కేసులో నిందితులందరినీ నేడు మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. విక్రమ్ పై ఆత్మహత్యాయత్నంతో పాటు సాక్ష్యాల మాయం, పోలీసులను తప్పుదారి పట్టించడం, విచారణకు సహకరించక పోవడం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. వైద్య పరీక్షల తరువాత విక్రమ్ మెడికల్ గా ఫిట్ గా ఉన్నాడని నిర్ణయించుకున్న తరువాతనే అరెస్ట్ చేశామని, అవసరమైతే అతనికి వైద్య సహాయాన్ని కొనసాగిస్తామని తెలిపారు.