: సౌదీలో తెలుగు యువకుడి దుర్మరణం
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు షేక్ అజామ్ (29) దుర్మరణం పాలయ్యాడు. ఉపాధి కోసం సౌదీ వెళ్లిన అజామ్ అక్కడ సర్వే సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. సోమవారం నాడు విధులు ముగించుకుని హోలియా ప్రాంతంలోని తన నివాసానికి వెళుతుండగా... ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించగా, నిన్న తెల్లవారుజామున ఆయన మృతి చెందాడు. అజామ్ మృతి చెందినట్టు ఆయన పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం ఆయన తల్లిదండ్రులకు తెలిపింది. మృతుడిది యాదాద్రి జిల్లా రామన్నపేట.
మరోవైపు, కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. ఈ నెల 10 తేదీన తమ కుమారుడు వస్తున్నాడనే ఆనందంలో తాము ఉన్నామని... ఇంతలోనే మరణవార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని వారు వాపోయారు. అజామ్ మరణవార్త విన్న స్థానికులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.