: ప్రాణం పోయినా రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను: మమతా బెనర్జీ
గూర్ఖాల్యాండ్ పోరాటాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఉద్యమకారులకు ఉద్యమాన్ని ఆపేయాలంటూ విజ్ఞప్తి చేశారు. డార్జిలింగ్ కనుమల్లో శాంతినెలకొనేలా చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆమె కోరారు. దినాజ్ పూర్ జిల్లా చోప్రా ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, ప్రాణాలైనా ఇస్తాను కానీ రాష్ట్రాన్ని మాత్రం ముక్కలు కానివ్వనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రత్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
కానీ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిందేంటంటే... ప్రతి జిల్లా మన ఆస్తి అని ఆమె చెప్పారు. బెంగాల్ లో వివిధ మతాలు, కులాలకు చెందిన ప్రజలున్నారని ఆమె గుర్తు చేశారు. భారత్ అంటే సామరస్యం, సుస్థిరత, భిన్నత్వంలో ఏకత్వం.. దానిని కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రాలను, తద్వారా దేశాన్ని ముక్కలు చేయకూడదని ఆమె అన్నారు. బెంగాల్ లోని ఇతర ప్రాంతాలను ప్రేమించినట్టే కొండప్రాంతమైన డార్జిలింగ్ ను కూడా ప్రేమిస్తానని ఆమె అన్నారు. డార్జిలింగ్ హిల్స్ పశ్చిమ బెంగాల్ లో భాగమని, భవిష్యత్ లో కూడా అదే కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.