: రాజమహేంద్రవరం రోడ్లపై యుద్ధ విమానాలు దిగడానికి ఎయిర్ స్ట్రిప్?


భారత వాయుసేన అత్యవసర పరిస్థితుల్లో తమ విమానాలను దించేందుకు ఎయిర్‌ స్ట్రిప్‌ లుగా జాతీయ రహదారుల్ని వినియోగించుకొనే అంశంపై కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో ఏడాది కాలంగా చర్చిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని 12 జాతీయ రహదారుల్లో అత్యవసర ఎయిర్ స్ట్రిప్ లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎయిర్ స్ట్రిప్ కావాలని భారత వాయుసేన సూచించింది. మావోయిస్టు, ఉగ్రవాద ప్రాబల్యం ఉన్న ప్రాంతాలతోపాటు ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాలున్న రాష్ట్రాల్లో అత్యవసర ఎయిర్‌ స్ట్రిప్‌ లు అవసరమని వాయుసేన స్పష్టం చేసింది. దీంతో ఏపీలో మన్యం, సముద్ర తీరాలకు దగ్గర్లో ఉండే రాజమహేంద్రవరాన్ని ఎంచుకోనున్నట్టు తెలుస్తోంది.

దీంతో రాజమండ్రి మీదుగా సాగే జాతీయ రహదారి 16ను ఎంపిక చేయనున్నారు. అయితే యుద్ధ లేదా సరకు రవాణా విమానాలు దిగాలంటే ఆరు లేన్ల రోడ్డు ఉండాల్సి ఉంటుంది. రాజమండ్రి సమీపంలో అలాంటి ప్రాంతం ఉందా? విమానాలు దిగే సమయంలో రోడ్డుపై గంటలతరబడి ట్రాఫిక్ ను ఆపాల్సి ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే బైపాస్ రోడ్లు ఉండాలి. రాజమండ్రి సమీపంలో అలాంటి ప్రాంతం ఉందా? అని వాయుసేనతోపాటు భారత జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఇంజినీరింగ్‌ వర్గాలు సంయుక్తంగా పరిశీలించాల్సి ఉంటుంది. రహదారిని విమానాలు దించేందుకు అనుకూలంగా మార్చేందుకు అవసరమైన నిధుల్ని వాయుసేన సమకూర్చనుంది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌ గఢ్‌, జార్ఖండ్‌, తమిళనాడు, అసోం, బిహార్‌, యూపీ, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల్నీ వాయుసేన విమానాల ల్యాండింగ్ కు అనుకూలమైనవో కాదో పరిశీలించనుంది. 

  • Loading...

More Telugu News