: మరోమారు రక్తమోడిన ఆఫ్ఘనిస్థాన్.. మసీదులో బాంబు పేలుడు.. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు!
ఆఫ్ఘనిస్థాన్ మరోమారు రక్తసిక్తమైంది. మైనారిటీలైన షియా ముస్లిం మసీదులో జరిగిన బాంబు పేలుడులో 20 మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. హెరాత్ నగరంలోని డెహర్ అబాద్ ప్రాంతంలోని జవాడియా మసీదులో ఈ ఘటన జరిగినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. స్థానిక షియా ముస్లింలు ప్రార్థన చేస్తుండగా బాంబు పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు మసీదు అంతా చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు శబ్దం వినగానే ముస్లింలు భయంతో పరుగులు తీశారు. ఛిద్రమైన అవయవాలతో మసీదు మొత్తం భీతావహంగా మారింది.