: తలకు వెల....డ్రగ్స్ దందాపై రాసిన జర్నలిస్టును చంపేందుకు రేటు ఫిక్స్ చేసిన డ్రగ్ డీలర్!
హైదరాబాదులో డ్రగ్ దందా వెలుగు చూసిన అనంతరం సిట్ సినీ ప్రముఖులను విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ దందాపై పూర్తి వివరాలు సేకరించిన ఆంగ్లపత్రిక జర్నలిస్టు... 'డార్క్ నెట్' సైట్ ద్వారా ఈ దందా జరుగుతోందని రాశాడు. భారత్ కు మ్యాడ్లీబూటెడ్ ఐడీతో ఒక పెడ్లర్ భారీగా మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడు. దీనిపై సదరు జర్నలిస్టు తన కథనంలో పూర్తి వివరాలు రాశాడు.
అంతే.. ఈ కథనం చదివిన సదరు డ్రగ్ పెడ్లర్... ఇంటర్నెట్ లో ఫత్వా జారీ చేశాడు. ఫేస్ బుక్ ద్వారా సదరు జర్నలిస్టు, అతని కుటుంబ సభ్యుల వివరాలు సేకరించిన ఆయన... వాటితో ఒక పోస్టర్ తయారు చేసి, అతనిని చంపిన వారికి నాలుగు బిట్ కాయిన్లు (రూ.7.2 లక్షలు), కుటుంబ సభ్యుల్ని చంపితే ఆరు బిట్ కాయిన్లు (రూ.10.8 లక్షలు) అందజేస్తానని వెలకట్టాడు. దీనిని ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకున్న సదరు జర్నలిస్టు సిట్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఐపీ అడ్రస్ ద్వారా డ్రగ్ పెడ్లర్ ను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.